ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కడపలో రాయలసీమ రణభేరి సభ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైఖరి చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని విమర్శించారు.
రాయలసీమ వాళ్లు ఫ్యాక్షనిస్టులు.. విమానాశ్రయం ఎందుకు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. కాబట్టి బీజేపీకి రాయలసీమ సమస్యలపై రణభేరి సభ నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు.
ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు తులసిరెడ్డి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా అన్యాయం చేసిందన్నారు.
శ్రీకాళహస్తి సమీపంలో మన్నవరం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్ ను మోడీ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. సీమ సాగునీటి ప్రాజెక్టులకు మూలాధారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను తెలంగాణ బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు తులసిరెడ్డి.