వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్ కంస మేనమామలా, శకుని మేనమామలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
3, 4, 5 తరగతులను ఎలిమెంటరీ విద్య నుంచి విడగొట్టి హై స్కూల్ విద్యలో కలపడం పిచ్చి తుగ్లక్ చర్య అని తులసి రెడ్డి అభివర్ణించారు. దీని వలన డ్రా పౌట్స్ పెరుగుతాయని తులసిరెడ్డి అన్నారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియాన్ని రద్దు చేయడం చారిత్రక తప్పిదమని.. దీని వలన మాతృ భాష అయిన తెలుగు మృత భాషగా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, జీఓ 77 వలన ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వర్తించవని, దీని వలన విద్యా దీవెన విద్యా శాపంగా మారిందని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో లీకేజీలు, మాస్ కాపీయింగ్‌లు నిత్య కృత్యమయ్యాయని తులసిరెడ్డి ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అలాగే, 3, 4, 5 తరగతులను హై స్కూల్ విద్యలో విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేయాలని, జీఓ 77ను ఉపసంహరించుకోవాలని, విదేశీ విద్యకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.