పార్లమెంట్ లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. విభజనపై మోడీ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి.
బీజేపీ పలాయన వాదానికి, పసలేని వాదనకు మోడీ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు తులసిరెడ్డి. అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లుగా ఆయన తీరు ఉందని సెటైర్లు వేశారు. విభజన జరిగిన ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆ విషయాలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్ గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు తులసిరెడ్డి. అలాగే కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.
ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా విభజన జరిగిన తీరు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు తులసిరెడ్డి. విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో బీజీపీ కూడా అంతేనని తెలిపారు. ఈమాట బీజేపీ నేత సుష్మాస్వరాజే అన్నారని గుర్తు చేశారు.