జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగం లా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ అని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహంలాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ అని మండిపడ్డారు. అటువంటి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ తో ముందుకు పోతానని పవన్ చెప్పడం.. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతా అన్నట్టు ఉందని దుయ్యబట్టారు.
సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని.. అదే సభా ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం అవివేకమన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు.
చేస్తే స్వశక్తి రాజకీయాలు చేయాలి.. లేకుంటే జనసేన పార్టీనీ బీజేపీలో విలీనం చేయాలి.. అంతేకానీ.. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయొద్దు అని హితవు పలికారు. ఇకనైనా ఇలాంటి డొంకతిరుగుడు రాజకీయాలు, బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలని విరుచుకుపడ్డారు తులసిరెడ్డి.