జగన్ పాలనలో ఏపీ.. మద్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. పచ్చని రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. దశలవారీగా మద్య నిషేధం అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి.. దశలవారీ మద్య నిషాను అమలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ప్రజలను తాగుబోతులుగా మార్చి మద్య నిషేధ పథకాన్ని.. తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా మార్చారని విమర్శించారు. వైసీపీ నేతలకు వ్యక్తిగత ఆదాయ వనరుగా లిక్కర్ మఫియా మారిందన్నారు. జగన్ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోందని అందుకోసమే ధరలు విపరీతంగా పెంచిందని ఆరోపించారు.
గడిచిన మూడేళ్ళలో 3 రెట్లు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం పెరిగిందని అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికే చీప్ లిక్కర్ బ్రాండ్ లు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందన్న తులసిరెడ్డి.. జంగారెడ్డిగూడెంలో అనేక మంది ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేనిఫెస్టో లో చెప్పినట్టుగా మద్య నిషేధాన్ని అమలు చేసి.. నాటుసారాను అరికట్టాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని అమలు చేయలేకపోతే జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి.. రాజకీయల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు తులసి రెడ్డి.