జగన్ ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. రైతుల పట్ల జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుతో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.
దీంతో రాష్ట్ర రైతులు పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం రైతు దుష్మన్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అవుతుందని వ్యాఖ్యానించారు తులసి రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అంటూ వ్యాఖ్యానించారు తులసి రెడ్డి. 2004 లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు చంద్రబాబు. ఇతర టీడీపీ నేతలు వ్యతిరేకించారని గుర్తు చేశారు.
ఎగతాలి చేసినా.. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. మీటర్లు బిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వేళ మీటర్లు బిగించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు తులసి రెడ్డి.