జగన్ పాలనలో రాష్ట్ర సంక్షేమం సంక్షోభంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పి గంతులు వేసినట్లుంది ఏపీలో జగన్ పాలన తీరు అని విమర్శలు గుప్పించారు తులసిరెడ్డి.
1975 లోనే ఇందిరా గాంధీ ప్రారంభించిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో అన్ని సంక్షేమ పథకాలను చేర్చి.. కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేశాయని గుర్తుచేశారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత తదితర సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న నగదును.. నాన్న బుడ్డి ద్వారా ప్రభుత్వం లాక్కొంటోందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అమలు చేసిన అమ్మ హస్తం, బంగారు తల్లి తదితర మహిళా సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రారంభించిందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని మండిపడ్డారు తులసిరెడ్డి.
ఒక్కొక్క సంఘానికి కాంగ్రెస్ హయాంలో రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేదని.. జగన్ పాలనలో రూ.3 లక్షలకు కుదించబడిందని విమర్శించారు. సీఎంకి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.