ఎన్నిక ముందు వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం ఇప్పటికే అమలు చేశామని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. వాస్తవాలను విశ్లేషిస్తే 95 శాతం హామీలు అమలు కాలేదని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతీ పథకంలో కోత విధించారని ఆరోపించారు. రైతు భరోసాలో కోత విధించారని మండిపడ్డారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ఇప్పుడు అనారోగ్య శ్రీ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో కనీసం మూడు ఇళ్లు కూడా కట్టించలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేశారని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ జాడ లేకుండా పోయిందన్నారు తులసి రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని వ్యాఖ్యానించారు. మద్య పాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చెల్లమ్మలకు పెళ్ళి కానుక విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని విరుచుకుపడ్డారు తులసి రెడ్డి.
ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం విషయంలో అన్యాయం చేస్తూ శ్రమ దోపిడి చేస్తోందని ఆరోపించారు. 35 నెలల్లో బటన్ నొక్కి రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామని సీఎం చెప్పిన మాట నిజమే అయితే.. మద్యం, ఇసుక, సిమెంట్, పెట్రోల్, డీజల్ ధరలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంపు తదితర విషయాలలో ప్రజలను మోసం చేస్తూ.. రూ.3.40 లక్షల కోట్లు దోచుకున్న ప్రభుత్వం మాటేమిటని నిలదీశారు తులసి రెడ్డి.