ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, బీజేపీ, టీడీపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాను సాధించడంలో ప్రాంతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని తులసి రెడ్డి ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలవి ఉడత ఊపులు మాత్రమేనని గళమెత్తారు. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు.. తెచ్చే శక్తి అంతకన్నా లేదని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమౌతుందన్నారు తులసి రెడ్డి. 2024లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రాంతీయ పార్టీలది పెండ్లింటి కాడ కుక్కల గోల లాంటిదని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ పార్టీల ఉచ్చులో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తులసి రెడ్డి సూచించారు. మాటమీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు. రెండున్నారేళ్ల పాలనలో రాష్ట్రానికి వైసీపీ చేసిందేం లేదన్నారు తులసి రెడ్డి.