నాడు దివంగత మాజీ సీఎం ఎన్ఠీఆర్ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆ రోజుల్లో ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారని, తెలుగుగంగ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో తన భాగస్వామ్యం ఉందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో సోమవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మంద్రాజుపల్లి, కొత్తూరు గ్రామంలో టీడీపీ క్యాడర్ తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ఠీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా తనను ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పది లక్షల ఎకరాల్లో సాగునీటిని ఇచ్చే పథకాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. నా కుటుంబాన్ని, నా అనుచరులను పక్కన బెట్టి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తుమ్మల పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్టు ఆయన వెల్లడించారు.
అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ సాగు చేసిన ఘనత తనకు పాలేరులోనే దక్కిందని ఆయన చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశంలో తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నా ఆయనకు మద్దతునివ్వాలని టీడీపీ మండల కమిటీ నిర్ణయించింది. ఎన్ఠీఆర్ సాక్షిగా ఎన్నికల్లో గెలిపిస్తామని వీరు హామీ ఇవ్వడం పట్ల తనకెంతో సంతోషం కలిగిందని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.