‘జలహారం’ వదిలేసి ‘జన భారం’ పెంచుతారా ?
హైదరాబాద్ : కేసీఆర్ స్వచ్ఛంద పదవీ విరమణ, కేటీఆర్ పట్టాభిషేకం తంతుకు ముందే తెలంగాణాలో అటు టీజేఎస్, ఇటు కాంగ్రెస్ జల పోరాటాలు చేపట్టి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించేందుకు సిద్ధం అయ్యాయి. పూర్తికాని కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి ప్రాణాధారమైన ‘ప్రాణహిత-చేవెళ్ల’, జలహారమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకుపెట్టడం, చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ అంచనా వ్యయాల్ని భారీగా పెంచేయడం ఎవరి ప్రయోజనాల కోసమని జనం సాక్షిగా ప్రశ్నించేందుకు విపక్షాలు సమాయత్తం కావడం విశేషం. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తరలించకుండా కేవలం ‘లిఫ్ట్’లకే ప్రాధాన్యం ఇవ్వడం ఎవరి ‘గిఫ్ట్’ కోసమని ఇప్పటికే రాష్ట్రమంతా చర్చ మొదలయ్యింది. దీనిపై ప్రజలకు మరింత అర్ధమయ్యేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. బంగారు తెలంగాణా సాకారానికి అందుబాటులో ఉన్న సాగు జలాలను అందించి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయడం కోసమే పోరాట మార్గం ఎంచుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే తొలుత ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు సందర్శన చేపట్టామని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అత్యున్నత స్థాయి బృందం తుమ్మిడిహెట్టి సందర్శన చేపట్టింది.
చేవెళ్లకు గోదావరి జలాలు ప్రకటించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 జనవరి 30న ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2008 జూన్ 30న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మంజూరు చేసింది. రూ.38.5 వేల కోట్లతో తెలంగాణాలోని ఏడు జిల్లాలకు 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ఇది. ప్రాజెక్టులోభాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. 160 టీఎంసీల నీటిని తరలించాలన్నది లక్ష్యం. దీన్ని ‘తెలంగాణకు జలహారం’గా కాంగ్రెస్ భావించింది. అసలు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మంజూరు చేయిస్తే తెలంగాణకు ఆర్థిక భారం కాకుండా పనులన్నీ పూర్తి చేయవచ్చునని ప్రణాళిక సిద్ధం చేసింది. బాబా సాహెబ్ అంబేత్కర్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ ఏర్పడ్డ నాటికే దాదాపు రూ.10 వేల కోట్ల పనులను చేపట్టింది. తుమ్మడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీరు తేవాలన్నది ప్రణాళిక. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును టీఆర్ఎస్ సర్కార్ మార్చేసింది. అంతేగాక భారీగా అంచనాలు పెంచింది. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే గ్రావిటీ ప్రాజెక్టును రూ.80 వేల కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టింది. ఎల్లంపల్లికి దిగువన మెడిగడ్డ దగ్గర కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం జరిపి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అతి తక్కువగా కనీసం 120 టీఎంసీల నీటిని తరలించవచ్చునని, దీని ద్వారా తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. ప్రభుత్వం ‘లిఫ్టుల’ పేరుతో అట్టహాసం చేస్తోంది.
‘వ్యాప్కోస్’ ఆనాడే చెప్పింది…
కేంద్ర పరిశీలన సంస్థ వ్యాప్కోస్ ఇక్కడ నీటిని పరిశీలించి 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే 160 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38.5 వేల కోట్లతో ‘ప్రాణహిత చేవెళ్ల’ పేరుతో ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని తలపెట్దింది. ఈ ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 70 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ మైలారం తరలించి అక్కడ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీరు తరలించాలని ప్రణాళిక. అయితే ఇక్కడ నీరు తక్కువగా అందుబాటులో ఉందని, అందువల్ల మెడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అధికంగా నీటిని తరలిస్తున్నట్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైనట్టు అదనంగా ఇంకో టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్టు 148 మీటర్ల దగ్గర బ్యారేజ్ కట్టినప్పటికీ 120 టీఎంసీల నీటిని తరలించవచ్యునని, ఇప్పటికే సిందిళ్ళ దగ్గర బ్యారేజ్ పూర్తిచేయడం వల్ల తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ నుంచి జైపూర్ వాగు ద్వారా ప్రాణహిత నీటిని ఎలాంటి ఎత్తిపోతల పథకం లేకుండా సిందిళ్ళకు పారించవచ్చునని, అక్కడ నుంచి ఎలాగూ లిఫ్ట్ ఏర్పాటుచేసి వున్నందున ఎల్లంపల్లికి నీటి తరలింపు సులువుగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.