టీవీ సీరియల్ నటి తునిషా శర్మ(21)మృతి కేసులో నిందితుడు షీజాన్ ఖాన్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. తునిషా శర్మ అంకుల్ సంజయ్ కౌశల్, ఆమె తల్లి వనితా శర్మలు ఆమె సంపాదనపై ఆధారపడేవారని, ఆమెపై వారు అజమాయిషీ చేసే వారని ఆరోపించారు.
అందుకే సంజయ్ కౌశల్ పేరు చెబితే తునిషా శర్మ గజగజ వణికి పోయేదన్నారు. డబ్బు అవసరం పడినప్పుడు తునిషా తన తల్లి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వుండేదన్నారు. ఆమె సంపాదించిన డబ్బపై ఆమెకే అధికారం ఉండకపోయేదన్నారు.
ఇక తునిషాతో బలవంతంగా షీజాన్ హిజాబ్ ధరింపజేశాడన్న తునీషా తల్లి వ్యాఖ్యలపై వారు స్పందించారు. ఓ సీరియల్‌లో పాత్ర కోసం ఆమె హిజాబ్ ధరించారని వారు పేర్కొన్నారు. కానీ దాన్ని తునీషా తల్లి, బంధువులు అసత్య ప్రచారాలతో వైరల్ చేస్తున్నారని వెల్లడించారు.
అంతకు ముందు తన కూతుర్ని షీజాన్ మోసం చేశాడని తునిషా తల్లి ఆరోపించింది. ఈ కేసులో అతనికి శిక్ష పడే వరకు తాను విడిచిపెట్టబోనని అన్నారు. నటి తునిషా శర్మ ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. షీజాన్ పురికొల్పడంతోనే తునిషా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో మరుసటి రోజే షీజాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని విచారించారు. న్యాయస్థానంలో ఆయన్ని ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం షీజాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.