టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు ఆమె బాయ్ ఫ్రెండ్ షీజాద్ ఖానే కారణమని ఆరోపిస్తున్న ఆమె సమీపబంధువు పవన్.. .. అతడ్ని కలిసిన తరువాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ఖాన్ తో పరిచయం అయ్యాక ఆమె హిజాబ్ ధరించడం ప్రారంభించిందని, రోజు రోజుకీ ఆమెలో మార్పులను తాము గమనించామని ఆయన చెప్పారు. ఖాన్ కి మరికొంతమంది ఇతర అమ్మాయిలతోను సంబంధాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారని, అందువల్ల వారు ఈ విషయంలో కూడా దర్యాప్తు చేయాలనీ ఆయన కోరారు.
తునీషా ఆత్మహత్య చేసుకునేలా ఖాన్ ప్రేరేపించాడన్నారు. పైగా పోలీసులకు వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతున్నాడని ఆరోపించారు. తాను నటిస్తున్న ఓ టీవీ షో లో సెట్స్ లోనే ఈ నెల 24 న తునీషా సూసైడ్ చేసుకుంది. ఖాన్ , తునీషా మధ్య రిలేషన్ షిప్ ఉందని, 15 రోజుల క్రితమే ఇద్దరికీ బ్రేకప్ అయిందని ఈ కేసులో పోలీసులు తేల్చారు.
తమ కూతురి మృతికి ఖానే కారణమని తునీషా తల్లి కూడా ఆరోపించి.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాకీలు అతడిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇతడిని ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
అయితే తన క్లయింటు నిర్దోషి అని షీజాద్ ఖాన్ తరఫు లాయర్ వాదిస్తున్నారు. ఈ నెల 24 సాయంత్రం ఖాన్ సహా మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తునీషాను చేతులమీద మోసుకుని తమ ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు వాసాయ్ ఆసుపత్రి డాక్టర్ ఒకరు చెప్పారు. చాలాసేపు ఖాన్ విలపిస్తూనే ఉన్నాడని, తునీషాను ఎలాగైనా బతికించాలని కోరాడని ఆయన తెలిపారు.