టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ కి బెయిల్ లభించింది. తునీషాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడన్న ఆరోపణపై ఇతడిని గత డిసెంబరు 25 న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన షీజాన్ ఖాన్.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మహారాష్ట్ర లోని పాల్గర్ జిల్లా వాసాయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిన్న ఇతనికి బెయిల్ మంజూరు కాగా.. ఆదివారం థానే సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు.
గత ఏడాది డిసెంబరు 24 న పాల్గర్ జిల్లాలోని వాలివ్ ప్రాంత సమీపంలో టీవీ సీరియల్ సెట్స్ పై తునీషా శర్మ సూసైడ్ చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సుమారు 69 రోజులు ఇతగాడు జైల్లో ఉన్నాడు.
ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైందని, దర్యాప్తు కూడా పూర్తయిందని, అందువల్ల తన క్లయింటును విడుదల చేయాలని ఇతని తరఫు లాయర్ శరద్ రాయ్ .. కోర్టును కోరారు. దీంతో లక్ష రూపాయల పూచీకత్తుపై షీజాన్ ఖాన్ ను రిలీజ్ చేయాలని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి దేశ్ పాండే ఆదేశించారు. ఆదివారం జైలు బయట వేచి ఉన్న తన బంధువులను కలుసుకున్నషీజాన్ ఖాన్..మీడియాతో మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయాడు.
తన పాస్ పోర్టును సరెండర్ చేయాలని, ముందస్తు అనుమతి లేకుండా దేశం వదలి వెళ్లరాదని కోర్టు.. ఇతడిని ఆదేశించింది. ‘అలీబాబా..దస్తాన్-ఏ-కాబూల్’ అనే సీరియల్ లో తునీషా, షీజాద్ ఖాన్ కలిసి నటించారు. వాలివ్ పోలీసులు షీజాద్ పై 500 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేశారు.