తినేందుకు మనకు అనేక రకాల దోశ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో తుప్ప దోశ కూడా ఒకటి. తుప్ప ఏంటి ? అనుకుంటున్నారా ? ఏమీ లేదండీ.. కన్నడలో తుప్ప అంటే నెయ్యి అని అర్థం. అంటే నెయ్యి దోశ అన్నమాట. దోశను నెయ్యితో గోధుమ వర్ణంలోకి వచ్చేట్లు బాగా కాల్చితే అది క్రిస్పీగా మారుతుంది. దాన్ని సాంబార్, చట్నీలతో లాగించేయవచ్చు. అవును.. చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. మరి ఈ దోశను ఎలా తయారు చేయాలో, దానికి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
తుప్ప (నెయ్యి) దోశ తయారీకి కావల్సిన పదార్థాలు:
* బియ్యం – ఒకటిన్నర కప్పు
* మినపప్పు – 1 కప్పు
* మెంతులు – 1 టీస్పూన్
* నెయ్యి – దోశలను కాల్చేందుకు తగినంత
* ఉప్పు – రుచికి సరిపడా
నెయ్యి దోశను తయారు చేసే విధానం:
ఒక పాత్రలో కొంత నీటిని పోసి అందులో బియ్యం, మినపపప్పు, మెంతులను వేసి బాగా కడగాలి. అనంతరం నీటిని వడకట్టి మళ్లీ నీటిని పోయాలి. తరువాత 2 గంటల పాటు వాటిని నానబెట్టాలి. అనంతరం మళ్లీ అరకప్పు నీటిని పోసి మెత్తని పిండిగా పట్టుకోవాలి. తరువాత ఆ పిండికి కొద్దిగా ఉప్పును చేర్చాలి. బాగా కలపాలి. ఆ తరువాత 7 నుంచి 8 గంటల పాటు పిండిని అలాగే ఉంచాలి. రాత్రి పూట పిండిని ఈ విధంగా తయారు చేసుకుంటే మరుసటి ఉదయం వరకు ఆ పిండి పులుస్తుంది. దీంతో పెనంపై దోశలను కాల్చుకోవచ్చు.
నాన్‌స్టిక్ పెనంపై కొద్దిగా నెయ్యి వేసి తరువాత పిండితో దోశలను కాల్చాలి. దోశ పిండిని పెనంపై దోశలా వేశాక కూడా నెయ్యి వేయాలి. దీంతో దోశకు రెండు వైపులా నెయ్యి ఉంటుంది. ఈ క్రమంలో రెండు వైపులా దోశ బాగా కాలుగుతుంది. గోధమ వర్ణంలోకి దోశ మారుతుంది. అదే సమయానికి దోశ క్రిస్పీగా మారుతుంది. అలా కాలిన దోశను సాంబార్ లేదా చట్నీతో లాగించేయవచ్చు.