టర్కీ భూకంపం తర్వాత కనిపించకుండా పోయిన విజయ్ కుమార్ కథ విషాదంగా ముగిసింది. టర్కీలో ఓ భవన శిథిలాల కింద వినయ్ కుమార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. వినయ్ కుమార్ ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా వాసి. బెంగళూర్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.
ఆఫీసు పనిపై అధికారికంగా ఆయన టర్కీకి వెళ్లారు. అక్కడ మాల్యతాలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఆ సమయంలో భూకంపం ధాటికి హోటల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో విజయ్ కుమార్ మరణించారు. అయితే శిథిలాలు కింద చిక్కుకు పోవడంతో ఆయన ముఖం గుర్తు పట్టలేనంతగా నలిగి పోయింది.
అతను వేసుకున్న దుస్తులు, చేతిపై ఉన్న ఓం అనే టాటూ ఆధారంగా అతన్ని విజయ్ గా గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణ వార్తను భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
ఆయన భౌతికకాయాన్ని మొదట ఇస్తాంబుల్‌కు తరలించి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకురానున్నారు. వినయ్ కుమార్ భార్య కుమారుడు ఉన్నారు. ఆయన బెంగళూరులోని ఆక్సిప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్యాస్ ప్లాంట్ కంపెనీలో టెక్నీషియన్ గా పని చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 25న కంపెనీ పనిపై టర్కీ వెళ్లారు. అక్కడ మాలత్యలోని అవసర్ హాస్టల్ లో బస చేస్తున్నారు. ఆ సమయంలో భూకంపం వచ్చింది. భూకంప వార్తల నేపథ్యంలో వినయ్ కుమార్ ను ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించామని ఆయన సోదరుడు అన్నారు.
వినయ్ ఫోన్ రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయలేదన్నారు. వినయ్ చివరిసారిగా ఈ నెల 5న భార్య, ఆరేళ్ల కుమారుడితో ఫోన్ లో మాట్లాడారు. భూకంపం వచ్చినప్పటి నుంచి ఆయన ఆచూకి దొరక్కుండా పోయింది. దీంతో ఆయన ఆచూకీ కోసం చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్త రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.