ఆపన్న హస్తం కోసం గంటలతరబడి ఎదురు చూస్తున్న తమను పరామర్శించేందుకు ఎందుకు వచ్చారంటూ టర్కీ లోని పలు నగరాల్లో భూకంప బాధితులు అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ని నిలదీశారు. ముఖ్యంగా హకన్ తన్రివెర్డి సిటీలో అనేకమంది బాధితులకు నేటికీ సాయం అందలేదు. ఎర్డోగన్ రాక పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తూ.. ‘షేమ్ ఆన్ యూ’ (సిగ్గుండాలి) అని దుయ్యబట్టారు. రానున్న మూడు నెలల్లో టర్కీ అధ్యక్ష పదవికి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ఎర్డోగన్ గెలిస్తే 2028 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మే 14 న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ పెను ఉపద్రవంతో.. ఈయన రాజకీయ భవితవ్యం సందిగ్ధంగా మారింది. ఈ మూడు నెలల కొద్ధి కాలంలోనే ప్రతిపక్షాలు కూడగట్టుకుని తన విజయానికి ముప్పుగా మారుతాయేమోనని ఎర్డోగన్ భయపడుతున్నారు. బహుశా అందువల్లే ఆయన నిన్నటి నుంచి భూకంప బాధిత ప్రాంతాల్లో పర్యటించడం ప్రారంభించారు.
10 నగరాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది కూడా.ఇప్పటివరకు సహాయక బృందాలు గానీ, అధికారులు గానీ, సైనికులు గానీ తమను రక్షించడానికి రాలేదని, ఎముకలు కొరికే చలిలో తమను తామే కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నామని హకన్ సిటీలో భూకంపం బారినుంచి బయటపడిన ఓ బాధితుడు తెలిపాడు.ప్రభుత్వం తమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించాడు. అడియాన్ అనే రాష్ట్రంలో కూడా అనేకమంది బాధితులు ఇతని లాగే ఎర్డోగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. శిథిలాల్లో ఇంకా అనేకమంది చిక్కుకుని అల్లాడుతున్నారని వారు తెలిపారు.
అయితే ఈ అధ్యక్షుని సహాయ చర్యలపట్ల కొంతమంది బాధితులు సంతృప్తినికూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల ఫలితంగానే తాము సురక్షితంగా ప్రాణాల నుంచి బయటపడ్డామని బాధితుల్లో కొందరు సంతోషం ప్రకటించారు. ఓ వృద్ధ మహిళ.. ఆయన భుజంపై వాలిపోయి తన కృతజ్ఞతను తెలియజేసింది. భూకంప బాధితులను రక్షించడంలో కొన్ని పొరబాట్లు జరుగుతున్నాయని ఎర్డోగన్ అంగీకరించారు. రాజధాని అంకారా నగరంలో తాను రెండు రోజులు పర్యటించానని, సహాయక చర్యలను పర్యవేక్షించానని ఆయన వెల్లడించారు. అడియామన్ వంటి ప్రావిన్స్ లలో త్వరలో పర్యటిస్తానన్నారు.