పెను భూకంపానికి విలవిలలాడిన టర్కీ, సిరియా దేశాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాటికి ఈ సంఖ్య 15,383 కి చేరినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఇది ఇంకా ఎక్కువే ఉండవచ్చునని తెలుస్తోంది. తమ దేశంలో 12,391 మంది మృతి చెందారని, సుమారు 63 వేలమంది గాయపడ్డారని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజన్సీ ప్రకటించినట్టు అనడోలు వార్తా సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఆరువేలకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
టర్కీలోని ఖారన్ మన్ మారాస్, హతాయ్, ఉస్మానియె, మలత్యా వంటి దాదాపు 10 నగరాల్లో 13 మిలియన్లకు పైగా ప్రజలు ఈ పెను విలయానికి గురయ్యారు. శీతల గాలులు, వణికిస్తున్న చలి, తరచూ పడుతున్న వర్షం.. సహాయక చర్యలకు తీవ్ర అవరోధం కలిగిస్తున్నాయి.
మరో మూడు నెలల్లో అధ్యక్షుడు ఎర్డోగన్ .. అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్న తరుణంలో ఈ భూకంపం ఆయన రాజకీయ జీవితానికి సవాలుగా నిలిచింది. మే 14 న టర్కీ అధ్యక్ష పదవికి, పార్లమెంటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2003 నుంచి ఈ దేశానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ ‘డిజాస్టర్’ లో చిక్కుకుపోయారు. ఇక ఇండియా నుంచి సహాయ సామగ్రితో కూడిన ఆరో విమానం టర్కీ చేరింది.
టర్కీ లో 10 మంది భారతీయులు
ఇండియా నుంచి టర్కీ వెళ్లినవారిలో 10 మంది ఉన్నట్టు తెలిసింది. వీరిలో ఓ ఇంజనీర్ ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే ఇతరులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సిరియాలోను ఈ ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని నింపింది. అనేక చోట్ల నేలమట్టమైన కట్టడాల శిథిలాల నుంచి గాయపడినవారిని రక్షించేందుకు రక్షణ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక్కడ కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి నుంచి ఈ దేశానికి సాయం అందడం ప్రారంభమైంది. ఇక్కడి సుమారు 40 లక్షలమంది ప్రజలకు అత్యవసర సహాయ సామాగ్రిని పంపేందుకు ఐరాస అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.