టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 41వేలు దాటింది. మంగళ వారం సుమారు 9 వేల మందిని శిథిలాల కింద నుంచి సురక్షితంగా సహాయ బృందాలు బయటకు తీశాయి. వీరంతా సుమారు 200 గంటల పాటు శిథిలాల కింద మృత్యువుతో పోరాడారు.
టర్కీలో 35,418 మంది మరణించగా, సిరియాలో 5,814 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన సహాయక బృందాలు కూడా అలుపెరగకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. మరోవైపు 40 మందితో కూడిన భారత ఆర్మీ సిబ్బంది కూడా ఈ సహాయక చర్యల్లో పాల్లొంటోంది.
భవనాల శిథిలాల వద్ద జాగిలాలతో సహాయ బృందాలు అణువణువూ జల్లెడ పడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని ప్రజలు నీరు, ఆహారం లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు మీడియా సంస్థలు తెలిపాయి. టర్కీలో 22 లక్షల మంది తమ నివాసాలు వదిలి వెళ్లిపోయినట్టు అధికారు తెలిపారు.