మహాత్మా గాంధీ విద్యార్హతలపై క్రమంగా వివాదం రాజుకుంటోంది. ఆయనకు ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని ఇటీవల జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ మండిపడ్డారు. ‘నువ్వు అమాయకుడివి’ అని విమర్శించారు. గ్వాలియర్ లోని ఐటీఎం యూనివర్సిటీ లో రామ్ మనోహర్ లోహియా మెమోరియల్ లెక్చర్ ఇచ్చిన మనోజ్ సిన్హా.. గాంధీజీకి లా డిగ్రీ ఉందన్నది తప్పుడు అభిప్రాయం మాత్రమేనని, ఆయనకు హైస్కూలు డిప్లొమా మాత్రమే ఉందని, కానీ లా చదివినంతగా తనను ప్రొజెక్ట్ చేసుకున్నారని అన్నారు.
దేశానికి గాంధీ ఎంతో సేవ చేశారని, అయితే ఆయన జీవితంలో సత్యం తప్ప మరేమీ లేదని కొంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సత్యాన్ని నమ్మిన ఆయన తన అంతర్వాణిని వదులుకోలేదని, అందువల్లే జాతిపిత అయ్యారని మనోజ్ సిన్హా అన్నారు. గాంధీజీకి డిగ్రీలు లేవన్న మనోజ్ సిన్హా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తుషార్ గాంధీ.. ప్రధాని మోడీ గురించి గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించారు. తన పొలిటికల్ సైన్స్ లో మోడీకి డిగ్రీ ఉందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన అపహాస్యం చేశారు.
బాపూజీకి పూర్తి స్థాయిలో డిగ్రీ లేదన్న విషయాన్నీ తాను అంగీకరిస్తానని, కానీ తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1887లో రాజ్ కోట్ లోని ఆల్ ఫ్రెడ్ హైస్కూలు నుంచి, లండన్ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ డిగ్రీ తీసుకున్నారని ఆయన వివరించారు. లాటిన్ , ఫ్రెంచ్ లో కూడా ఆయన రెండు డిప్లొమాలు అందుకున్నారన్నారు.
ఇవి మీకు తెలియవా అన్నట్టు ప్రశ్నించారు. పైగా గాంధీజీ ఆటో బయోగ్రఫీని మనోజ్ సిన్హాకు పంపుతూ ..ఈ సమస్య చుట్టూ దయనీయమైన జర్నలిజం ప్రమాణాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని చదివి మీరు ఎడ్యుకేట్ అవుతారని ఆశిస్తున్నానన్నారు.