హైదరాబాద్: న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగి ప్రజాస్వామ్యయుతంగా పోరాటాన్ని కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందని, వాటిని పరిష్కరించా ల్సిందిపోయి, అణచివేస్తామని పాలకులు బహిరంగంగా ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పోకడలను ప్రదర్శించడమేనని వారు ఆరోపించారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసే బాధ్యత ప్రభుత్వానిదేనని వారు డిమాండ్ చేశారు. కార్మికులు ఉద్యోగాలలో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని డెడ్ లైన్ విధించి బెదిరించడం, అరెస్టులు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని వారు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్ళు కుచ్చితే తమ పంటితో తీస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్థుతం అంత కఠినంగా వ్యవహరించడం సరైంది కాదని వారు సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంపూర్ణ మద్దతునివ్వాలని శేఖర్, విరాహత్ అలీ పిలువునిచ్చారు.