జగన్ సర్కార్ మూడు నెలల్లోనే మీడియా గొంతు నొక్కే సాహసం చేసింది. ప్రజాస్వామ్య సూత్రాలకు పాతరేసింది. తమకు నచ్చని వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న అక్కసుతో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్ల ప్రసారాలను నిలిపి వేయాలని కేబుల్ ఆపరేటర్లకు మంత్రులు హుకుం జారీ చేశారు. అంతే.. ఒక్క హెచ్చరికకు అత్యధిక శాతం ఎంఎస్‌వోలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లను నిలిపివేశారు.
విజయవాడ: టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లు అత్యధిక కవరేజీ ఇచ్చాయన్నఅసంతృప్తి జ్వాల రగిలింది. ఇది జాతీయ మీడియాలో హైలెట్ అయింది. దీంతో జగన్ సర్కార్ అసలు రంగు బయట పడింది. ఆ రెండు చానళ్లను బంద్ చేసింది. టీవీ9, 10టీవీ వంటి ఇతర చానళ్లలోనూ చలో ఆత్మకూరు కార్యక్రమాల ప్రసారాలు చేసినప్పటికీ అవి టీఆర్ఎస్ సర్కార్ జేబులో చానళ్లు కావడంతో వాటి జోలికి పోలేదు.
ట్రాయ్ సిఫారసుల ఉచిత చానళ్లను నిలిపివేయడం చట్ట విరుద్ధం. ఎవరైనా ఒక చానల్‌ను నిలిపివేస్తే చర్యలు తీసుకునే అధికారం ట్రాయ్‌కి ఉంటుంది. కొత్తగా చట్టం ప్రకారం చందాదారు కోరుకున్న వంద ఉచిత చానళ్లను కచ్చితంగా ప్రసారం చేయాలి. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉచిత చానళ్లే. వాటిని కచ్చితంగా ప్రసారం చేయాల్సిన బాధ్యత కేబుల్ ఆపరేటర్లపై ఉంది. అందుకే ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను పాటించడానికి కొంతమంది కేబుల్ ఆపరేటర్లు సందేహించారు. కానీ తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రసారాలు నిలిపివేశారు.
గతంలో తెలంగాణ సర్కార్ టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను తెలంగాణలో నిషేధించింది. దాదాపుగా ఏడాదిన్నర పాటు కేబుల్ ఆపరేటర్లు అప్రకటిత నిషేధం కొనసాగించారు. ఆ తర్వాత ట్రాయ్ ఉత్తర్వుల కారణంగా మళ్లీ ప్రసారాలు ప్రారంభించారు. ఇప్పుడు ఏపీ సర్కార్ తమకు నచ్చని చానళ్లపై అదే విధమైన నిర్బంధానికి పాల్పడుతోంది. అప్పటితే పోలిస్తే ఇప్పుడు చట్టం మరింత బలంగా ఉంది. అయినా జగన్ సర్కార్ ఏమాత్రం చట్టం పట్ల గౌరవం లేకుండా హెచ్చరికలతో ఎం.ఎస్.వో.లను ఒత్తిడి తెచ్చి ప్రసారాలు బంద్ చేయించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. టీడీపీ నేత చంద్రబాబు సీనియర్లతో జరిగిన సమావేశంలో ప్రసార మాధ్యమాలపై ప్రభుత్వ ఉక్కుపాదాన్ని ప్రస్తావిస్తూ, ఈ అంశంపై పార్టీ తరపున ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు సమాచారం.