సూర్యున్ని ఆపాలనుకోవటం ఎంత అవివేకం… అప్పుడప్పుడు వచ్చే నాలుగు మబ్బులు సూర్యకాంతిని కనపడకుండా చేయగలవేమో కానీ… పర్మినెంట్‌గా ఆపేస్తాయనుకోవటం ఎంత భ్రమ. తన చుట్టూ పరిభ్రమించే వాటికి వెలుగు నిచ్చే రవికాంతిని ఆపతరం అవుతుందా…? అర చేతిని అడ్డుపెట్టి ఆపేస్తాననటం ఎంతటి మూర్ఖత్వం…?
సూర్యున్ని కారు మబ్బులు కమ్మినప్పుడు వచ్చే ఆమాత్రం వెలుగులు కూడా రవిప్రకాశాలే కానీ స్వయం ప్రకాశాలు కావు కదా… ఆ మాత్రం అర్థం చేసుకోని జ్ఙానులు ఉన్నారా…?
పెరుగుట విరుగట కొరకే… అన్న సిద్దాంతం ఎప్పటికీ నిజంకాక తప్పదు. పైగా అవినీతి పునాదుల మీద, రోజురోజుకు పెరిగిపోతున్న నోట్ల కట్టల సంచులను చూసుకొని విర్రవీగే వారంతా… ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో కనపడటం లేదా…? మీ బంజరుదొడ్లో కట్టేసుకొన్న గిత్తలు ఎంత ఎగిరితే ఎం లాభం…? అవి కూడా ఓనాడు ఆ రవికాంతికి జేజేలు పలికినవే కదా…
ఓ నాలుగు కుటుంబాలు, గుప్పెడు మనుషులు ఇప్పుడు రవి కిరణాలను ఆపేందుకు యజ్ఙం చేయబోతున్నారు. కాదని తెలిసీ, ఆపలేమని అర్థమయినా… ఎలాగు అధికారం ఉంది కదా అని… ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ నాలుగు కేసులు, రెండు అరెస్ట్‌లు ఆపగలవా. ఆపగలిగితే… ఎందరో తొక్కివేయాలనుకున్న ప్రభుత్వాధినేతలు ఎందుకు విజయం సాధించలేదు…? నాలుగు రోజులు జైల్లో పెట్టి, మానసికంగా వేధిస్తే గెలుపు మనదే అనుకుంటే ఎలా….? దేశ చరిత్రలో ఎంత మంది మహానీయులు జైలు జీవితం గడిపి వచ్చారు. ఎన్నో నిర్భందాలను ఎదుర్కొన్నవారే. కానీ వారంత చివరకు జయకేతనం ఎగురవేశారు. నాటి నుండి నేటి పాలకుల వరకు ప్రభుత్వ నిర్భందాలకు పోరాడిన వారే. చరిత్రలు చదివే అలవాటుంటే… చదివితే స్పష్టంగా తెలుస్తాయి. ఎమర్జెన్సీ కాలంలో చేసిన అరెస్ట్‌లకు, ఇప్పుడు మీ అరెస్ట్‌లకు పెద్ద తేడా లేదు. కానీ మీ అరెస్ట్‌లు నేతల సంకల్పాన్ని మరింత దృడంగా తయారుచేశాయి. ప్రభుత్వ నిర్భందాలు ఎదుర్కొని వచ్చిన వారే… నేటి రూలర్స్.
చరిత్ర… మీ గడీల్లో బానిస కాదు. చెప్పినట్లు వినడానికి… చరిత్ర వర్తమానానికి పునాది. సూర్యున్ని ఆపలనుకోవటం భ్రమ…. సూర్యడస్తమించని సామ్రాజ్యాలే కూలిపోయాయి. కానీ సూర్యుడు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాడు. నిర్భందాలు పెరిగే కొద్ది… తిరుగుబాటు తీవ్రతరం అవుతుంది. అది నిర్భందకారుల దహానికి కారణమవుతుంది.