కవల పిల్లలు ఎవరికైనా ముద్దుగా అనిపిస్తారు. తెలియకుండానే మన అటెన్షన్ వాళ్ళమీదకు వెళ్ళిపోతుంది. ఇద్దరు ఒకేలా ఉండడం. పక్క పక్కనే తిరుగాడుతూ ఉండడం. ఒకే రకం బట్టలు వేసుకోవడం లాంటి సంగతులు భలే సరదాగా అనిపిస్తాయి.పోలికల్లో పెద్దతేడాలు ఉండవు కాబట్టి ఇంట్లోవాళ్ళు తప్ప బయట వాళ్ళు తొందరగా వాళ్ళని పోల్చుకోలేరు. అయితే ఇద్దరి పుట్టుక నిమిషాల్లో తేడా ఉంటుందేమో కానీ నెలలు, సంవత్సరాల్లో తేడా ఉండదు. అలాంటి తేడా ఉన్న అరుదైన సంఘటన అమెరికా టెక్సాస్ లో జరిగింది.
కవల పిల్లలు కొన్ని నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. కాలీ జో, క్లిఫ్ జంటకు అరుదైన సమయంలో కవల పాపలు పుట్టారు. 2022 డిసెంబర్ 31న రాత్రి 11.55 గంటలకు మొదటి పాప అన్నీ జోకు కాలీ జో జన్మనిచ్చింది. అనంతరం కొత్త ఏడాది జనవరి 1న 12.01 గంటలకు ఈఫీ రోజ్ స్కాట్ అనే రెండో పాప పుట్టింది.
కాగా, ఆరు నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో కవల పిల్లలు పుట్టడంపై కాలీ జో, క్లిఫ్ జంట ఆనందానికి అంతు లేకుండా పోయింది.
తమ సంతోషాన్ని ఫేస్‌బుక్‌లో వారు పంచుకున్నారు. ‘అన్నీ జో, ఈఫీ రోజ్ స్కాట్‌లను పరిచయం చేయడం నేను, క్లిఫ్ చాలా గర్వంగా ఫీలవుతున్నాం’ అని కాలీ జో పేర్కొంది.
2022 డిసెంబర్ 31న రాత్రి 11:55 గంటలకు జన్మించిన చివరి పాప అన్నీ అని, 2023 జనవరి 1న ఉదయం 12:01 గంటలకు మొట్టమొదటిసారిగా జన్మించిన పాప ఈఫీ రోజ్ అని కాలీ జో తెలిపింది.
వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, 5.5 పౌండ్లు బరువు ఉన్నట్లు వెల్లడించింది. అరుదైన సమయంలో కవలలకు జన్మనివ్వడం తమకు చాలా ఆశ్చర్యంగాను, చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది.