మీరంతా దుల్కర్ సల్మాన్ సినిమా కురుప్ చూసే ఉంటారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం శవాన్ని కారులో పెట్టి తగులబెడదాం అనుకుంటారు. కానీ, చివరకు మర్డర్ చేసి అనుకున్న ప్లాన్ ను అమలు చేస్తారు. మెదక్ జిల్లా సజీవదహనం కేసు కూడా కాస్త అటూఇటుగా ఇలాగే అనిపిస్తోంది. ఈ కేసులో విచారణ జరిపేకొద్దీ సంచలన విషయాలు వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళ్తే… ఈనెల 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యాడు.అర్థరాత్రి కారుతో సహా అతన్ని సజీవ దహనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కారు సమీపంలో ఒక బ్యాగు, పొదల్లో పెట్రోల్ డబ్బాను గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
మృతుడు సచివాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ పాతులోతు ధర్మగా గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందన్న అంశంపై విచారణ ముమ్మరం చేశారు. చివరకు కేసు కీలక మలుపు తిరిగింది. చనిపోయింది ధర్మ కాదు, కారు డ్రైవర్ అని తేల్చారు పోలీసులు. బీమా డబ్బుల కోసం ధర్మ నాటకం ఆడినట్లు గుర్తించారు.
డబ్బుల కోసం సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మ డ్రైవర్ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే డ్రామా క్రియేట్ చేశాడని చెప్పారు. అప్పులపాలైన అతడికి బెట్టింగ్ అలవాటు ఉందని.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అవి తీర్చొచ్చని పన్నాగం పన్నాడన్నారు. ధర్మాను గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.