రెండు రోజుల క్రితం వనస్థలిపురం ఎంఆర్‌ఆర్ బార్ దోపిడీ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దోపిడీ అయ్యిందని చెబుతున్న డబ్బులు హవాలా సొమ్ముగా పోలీసులు గుర్తించారు. అమెరికా నుంచి ప్రవీణ్ అనే వ్యక్తి వెంకట్ రెడ్డికి పంపిస్తున్న డబ్బుతో ఇక్కడ వ్యవహారం నడుపుతున్నారు.
ఎప్పటిలాగానే 7 వ తేదీ రాత్రి కూడా వ్యాపారం ముగిసిన తరువాత హవాలా సొమ్ముతో వెళ్తుండగా దోపిడీ దొంగలు ఆయనను వెంబడించి సొమ్ము ఎత్తుకుపోయే క్రమంలో జరిగిన పెనుగులాటలో 26 లక్షలు కిందపడగా..మిగిలిన సొమ్మును దొంగలు ఎత్తుకుపోయారని బాధితుడు వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. వెంకట్ రెడ్డి ఫారుఖ్ అనే వ్యక్తి కలిసి ఈ హవాలా వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు అమెరికా నుంచి వచ్చిన 28 కోట్ల డబ్బులతో ఫారుఖ్, వెంకట్ రెడ్డి కలిసి ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఫారుఖ్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఫారుఖ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.