కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయింది. నిబంధనల ఉల్లంఘనలో భాగంగా ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదంతా కేంద్రం ఒత్తిడి వల్లే జరిగిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతల అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి. పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అయిన ఐఎన్సీ ఇండియాను చూడగలుగుతున్నా.. కొత్త ట్వీట్లను మాత్రం పోస్ట్ చేయలేకపోతున్నారు.
పార్టీ ఖాతాతోపాటు కొత్తగా మరో ఐదుగురు నేతలకు చెందిన అకౌంట్లను నిలిపివేసింది ట్విట్టర్. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ప్రణవ్ ఝా తెలిపారు. రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాణిక్కం ఠాగూర్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఖాతాలు లాక్ అయ్యాయని వివరించారు. ఈమధ్యే మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసింది ట్విట్టర్.
దేశవ్యాప్తంగా 5వేల మంది కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితా మరింత పెరగొచ్చని అంటున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు మండిపడుతున్నారు. దేశం కోసం తాము పోరాటం చేస్తున్నామని.. కానీ.. ప్రధాని మోడీ దాన్ని ఆపాలని చూస్తున్నారని విమర్శించారు.