టీఆర్ఎస్ లీడర్‌షిప్ కేసీఆర్ నుంచి క్రమంగా చేతిలోకి వెళ్తుండటంతో గులాబీ లీడర్లు అలర్టయిపోతున్నారు. చిన్నబాస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్నట్టుండి సోషల్ మీడియా బాటపడుతున్నారు. నిన్నా, మొన్నటి దాకా బస్తీమే సవాల్ అంటూ లొల్లి చేసి నేతలంతా.. ఎప్పుడూ లేనిది ట్విట్టర్ కూతలు మొదలుపెట్టారు. గ్రౌండ్‌లో ఎంత పనిచేసినా, మీడియా ముందు విపక్షాలను ఎంత తిట్టిపోసినా చిన్న బాస్ దృష్టికి వెళ్లకపోవడంతో .. ట్విట్టర్‌లోనే ఆయన్ను కాకపట్టే పని ముందుపెట్టుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకరిని చూసి ఒకరు అకౌంట్లు తెరిచేస్తున్నారు.
కొత్త తరం నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యేందుకో లేక ఐటీ మినిస్టర్ అన్న ప్రత్యేకతను ప్రదర్శించేందుకో గానీ..కేటీఆర్ చాలాకాలంగా ఏ విషయాన్నైనా, మాగ్జిమమ్ ట్విట్టర్‌లోనే చెప్పేస్తున్నారు. తానేం చేసినా అక్కడే పంచుకుంటున్నారు. ఎవరినైనా ప్రశంసించాలన్నా.. విమర్మించాలన్నా ట్విట్టర్‌నే ఆశ్రయిస్తున్నారు. ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే కూడా దొరకని కేటీఆర్.. పనీపాటా లేని నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ దృష్టిలో తాము కూడా పడాలంటే.. అందుకు బెస్ట్ షార్ట్‌కట్ రూట్ ట్విట్టరే అని చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఫిక్సయిపోయారు. దీంతో ఏళ్ల కింద, ఏనాడో సరదాగా మొదలుపెట్టి వదిలేసిన అకౌంట్లను మళ్లీ సీరియస్‌గా వాడటం మొదలుపెట్టారు.
మరోవైపు చాలా మంది నేతలకు దాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోవడంతో.. అలాంటి వారంతా ప్రత్యేకంగా ట్వీట్లు చేయడానికే కొంత మందిని నియమించుకుంటున్నారట.. సందర్భాన్ని బట్టి కేటీఆర్ చేసిన ట్వీట్లను రీట్వీట్ చేయడం, లైక్ కొట్టడం, కేటీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే వారికి కౌంటర్ ఇస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసే పనులను వారికి అప్పగిస్తున్నారట. ఇలా కేవలం ట్విట్టర్ కోసమే రిక్రూట్మెంట్ చేసుకున్న వారిలో మంత్రి స్థాయి నుంచి.. యూత్ లీడర్ల వరకూ ఉన్నారని సమాచారం. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు కేటీఆర్ గురించి ఏం మాట్లాడినా నిమిషాల్లోనే దానిపై విమర్శ ఉండాలని, అది కేటీఆర్ దృష్టికి చేరాలని వారికి చెబుతున్నారట ఆయా నేతలు. ఇటీవల వైట్ ఛాలెంజ్ విసిరినప్పుడు టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్‌లో దండయాత్ర చేయడం, రాహుల్ గాంధీ పేరును ట్రెండింగ్‌లోకి తీసుకు రావడానికి కారణం కూడా ఈ కొత్తగా రిక్రూట్ అయినవారేనని టాక్. ఇదిలా ఉంటే ఈ వ్యవహారమంతా చూస్తున్నవారు.. ఉద్యోగాల భర్తీపై మాట తప్పినందుకు… కనీసం ఇలాగైనా కొంతలో కొంత అయినా ఉద్యోగాలిస్తూ పరిహారం చెల్లించుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.