రైతుల ఉద్యమం, రిపబ్లిక్ డే రోజున జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ హింస నేపథ్యంలో కేంద్రం ట్విట్టర్ కు నోటీసులిచ్చింది. పలు అకౌంట్లను తాత్కాలికంగా నిషేధించాలని ఆదేశించింది. అయితే, ట్విట్టర్ ఒక్కరోజు నిషేధించి, మళ్లీ పునరుద్దరించింది. దీంతో తమ ఆదేశాలను పట్టించుకోలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజాగా ఈ నోటీసులపై ట్విట్టర్ రెస్పాండ్ అయ్యింది. రైతుల నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్న 1,178 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సంప్రదిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అధికారికంగా ఆయనతో చర్చలు జరుపుతున్నామని, భారత ప్రభుత్వం చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపైనా చర్చిస్తామని, అయితే… ఉద్యోగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
పాకిస్థాన్, ఖలిస్థాన్ మద్దతుదారులకు అనుకూలంగా ఉన్న 1,178 ఖాతాలను నిలిపివేయాలని ఫిబ్రవరి 4న ట్విట్టర్‌ను కేంద్రం ఆదేశించింది. అంతకుముందు రైతు నిరసనల్లో హింసకు సంబంధం ఉన్న ఖాతాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ను హెచ్చరించింది.