ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు ప్రపంచ వ్యాప్తంగా వున్న యూజర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం కోట్లాది మంది ట్విట్టర్ లో తమ సమయాన్ని గడుపుతారు. అయితే ఇటీవల తన రోజు వారి వినియోగదారుల సంఖ్యను అధికంగా చూపినట్టు ట్విట్టర్ తెలిపింది.
లింక్ చేసిన ఖాతాల్లో సాంకేతిక లోపం కారణంగా గత మూడేళ్లుగా తమ వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా లెక్కించినట్టు ట్విట్టర్ పేర్కొంది. 2022 మొదటి త్రైమాసికంలో విడుదల చేసిన ఆదాయ నివేదికలో వెల్లడించింది.
2019లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్టు ట్విట్టర్ చెప్పింది. దీని ద్వారా ఖాతాల మధ్య మరింత సులభంగా మారడానికి బహుళ ఖాతాలను ఒకదానితో ఒకటి లింక్ చేయడానికి వినియోగదారులను అనుమతించినట్టు ట్విట్టర్ తెలిపింది.
దీంతో ఈ తప్పు జరిగిందని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఈ కొత్త ఫీచర్ వల్ల కంపెనీ తన రోజువారీ వినియోగదారులను త్రైమాసికానికి 1.4 మిలియన్ల నుండి 1.9 మిలియన్ల వరకు ఎక్కువగా చూపించినట్టు తాము గుర్తించామని కంపెనీ పేర్కొంది.
ఆ తర్వాత దీన్ని సరిదిద్దామని ట్విట్టర్ వివరించింది. సర్దుబాట్ల తర్వాత 229 మిలియన్ల రోజువారీ వినియోగదారులను కలిగి ఉన్నట్టు ట్విట్టర్ చెప్పింది. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15.9 శాతం పెరిగినట్టు పేర్కొంది.