ఏ ముహూర్తాన ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాస్ అయ్యాడో గానీ.. వరుస బెట్టి చిక్కుల్లో పడుతున్నాడు. లీగల్ ట్రబుల్స్ పెరుగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో లోని తన కంపెనీ ఆఫీసుకు అద్దె కట్టనందుకు ఈ స్థల యజమాని ఆయనపై కోర్టుకెక్కాడు. నిజానికి అయిదు రోజుల్లోగా రెంట్ చెల్లించకపోతే మిమ్మల్ని డిఫాల్టర్ గా ప్రకటిస్తామని డిసెంబరు 16 నే ఆ యజమాని మస్క్ కి నోటీసు జారీ చేశాడట. ఈ సిటీలోని 30 వ ఫ్లోర్ లో ట్విట్టర్ కార్యాలయం ఉంది.
అయితే ఇన్నాళ్లయినా అద్దె చెల్లించలేకపోయేసరికి కొలంబియా రీట్ అనే ఓనర్ కి చిరాకెత్తింది. నాకు రెంట్ చెల్లించలేక చేతులెత్తేశాడంటూ మస్క్ మీద గత నెల 29 న శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశాడు. ఇక లీజు రద్దు చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయానికే కాదు. ప్రపంచ వ్యాప్తంగా గల ఇతర ట్విట్టర్ ఆఫీసులకు కూడా మస్క్ వారాల తరబడి అద్దె చెల్లించలేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ సంస్థపై ఓ ఓనరు కోర్టుకెక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రెండు చార్టర్ విమానాలకు ఈ కంపెనీ అద్దె నిరాకరించడంతో వాటి యజమానులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారట. ఈ సంస్థను తాను 44 బిలియన్ డాలర్లకు కొన్న తరువాత మస్క్ అద్దె చెల్లించడం ఆపేశాడని న్యూయార్క్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది.
ఇంత డబ్బు పోసి ట్విట్టర్ ని కొన్న తనకు ఆదాయం మాత్రం భారీగా తగ్గిపోయిందని మస్క్ వాపోయినట్టు తెలిసింది. తమ సంస్థకు యాడ్ లు ఇచ్చేవారిపై కొన్ని యాక్టివిస్ట్ గ్రూపులు ఒత్తిడి తేవడంవల్లే తన రెవెన్యూ తగ్గిపోయిందని ఆయన బేర్ మంటున్నాడు. మరి తాజా లీగల్ ట్రబుల్ నుంచి మస్క్ గట్టెక్కుతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.