సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. మార్చి 16వ తేదీన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు మరణించారు. కేడియా ఇన్ఫోటెక్, క్యూనెట్ సంస్థల నిర్లక్ష్యంతోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
స్వప్నలోక్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో క్యూనెట్ సంస్థపై నిఘా పెట్టిన పోలీసులకు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగానే కేడియో ఇన్ఫోటెక్ నిర్వాహకుడు అశోక్ కేడియా(60), క్యూనెట్ సంస్థ సీఈవో శివ నాగ మల్లయ్య (30) లను పోలీసులు అరెస్ట్ చేశారు.
క్యూనెట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తుందన్న విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇదే విషయంపై ఈ సంస్థలో పని చేసిన ఉద్యోగులు లక్షల రూపాయల్లో నగదు చెల్లించామని మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 30 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఈ కేసును మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగానే కేడియ ఇన్ఫోటెక్ నిర్వాహకుడు అశోక్ , క్యూనెట్ సంస్థ సీఈవో శివనాగ మల్లయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రిమాండ్ లో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.