అక్షరాస్యత,ఆధూనికత,విజ్ఞానం భారతదేశంలో ఎంతగా అభివృద్ధి చెందుతున్నా జాతిమత వివక్షలు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళన్న చందంగా ఉన్నాయి. అన్యకులస్థులైన అమ్మాయిలను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారన్న కారణంగా అన్నదమ్ముల వరసైన ఇద్దరు యువకులను గ్రామం నుంచి బహిష్కరించారు అక్కడి గ్రామస్తులు.
ఈ సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది. అయితే బాధితులిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులవడం విశేషం. ఒకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి అయితే, మరొకరు నేవీలో అధికారి. వివక్షను సహించలనేని ఆ ఇద్దరు రక్షణ దళ అధికారులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే పోల్సర పోలీస్ స్టేషన్ పరిధిలోని కలంబ గ్రామానికి చెందిన అరవింద్ కుమార్ ప్రధాన్ భారత వాయు సేన (ఐఏఎఫ్)లో అధికారి. బలాసి కులానికి చెందిన ఆయన ఖండాయత్ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
కాగా, సోదరుడి వరుసయ్యే వినయ్ కుమార్ ప్రధాన్ ఇండియన్ నేవీలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు సోదరులకు ఇటీవల పెళ్లిళ్లు జరిగాయి. అయితే కులాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆ గ్రామస్తులు వారిద్దరిపై సామాజిక బహిష్కరణ విధించారు. బంధువులెవరూ వారి ఇళ్లకు రావడం లేదు. ఏ కార్యక్రమానికి వారిని పిలువడం లేదు.
మరోవైపు గ్రామస్తులు విధించిన సామాజిక బహిష్కరణ పట్ల ఆ ఇద్దరు సోదరులు కలత చెందారు. రక్షణ దళాల్లో పనిచేస్తున్న అరవింద్ కుమార్, వినయ్ కుమార్ ఈ సామాజిక దురాచారాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు.
గ్రామం మొత్తం తమతో సామాజిక సంబంధాలను తెంచుకోవడంతో తాము శాపగ్రస్తమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వాపోయారు. సొంత గ్రామంలోనే ఎవరికీ కాకుండా మిగిలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు.