నార్సింగి వివాహిత అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జరిగిందంతా వారు వివరించారు. వీరి వద్ద నుంచి 2.5 తులాల పుస్తెల తాడు, రెండు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ పీరం చెరువులోని ఇండస్ వ్యాలీలో ఓ మహిళ పని చేస్తోంది. శనివారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా లింబ్ డమ్ విల్లా దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపించారు. తమ కారులో ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ఎక్కించుకున్నారు. అయితే.. కిస్మత్ పూర్ లోని నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి వద్ద ఉన్న 2.5 తులాల పుస్తెల తాడును కూడా ఎత్తుకెళ్లారు.
బాధితురాలితో బలవంతంగా మద్యం తాగించిన నిందితులు.. ఆమెను గండిపేట వద్ద వదిలివెళ్లారు. తర్వాత ఆమె నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. నిందితులను గంటల వ్యవధిలోనే గుర్తించారు. వీరు బాచుపల్లికి చెందిన శుభం, సుమిత్ గా తెలిపారు. నిందితులపై 365, 376(2)(జి), 392, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలతో కేసును చేధించి నిందితులను గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తు మొత్తాన్ని రికవరీ చేసుకున్నామన్నారు. సీసీ కెమెరాలోని పుటేజీని ఆధారంగా చేసుకొని నిందితులను జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తర్వాత వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.