ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా.. ఒకే ఊర్లో ఒకే రోజు పుట్టారు. ఒకే దగ్గర పెరిగారు. ఒకే దగ్గర చదువుకున్నారు. ఒకే తల్లి బిడ్డల్లా బతికారు. ఒకే రోజు మరణించారు. ఆ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో రెండు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలోని కొల్చారం మండలం కొంగోడ్కు చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. షేకులు దంపతులకు ఇద్దరు కుమారులు. లాలయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. షేకులు కుమారుడు అజయ్, లాలయ్య కుమారుడు నర్సింలు 2013 మే 22న జన్మించారు. వారు కొంగోడ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం విరామ సమయంలో పాఠశాలకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లారు విద్యార్ధులు. కాలు జారి అందులో పడిపోయారు. దీంతో వారు ఎంతకీ రాకపోయే సరికి వాళ్ల మరో స్నేహితుడు లక్ష్మణ్ వెళ్లి చూశాడు. వారిద్దరు నీటిలో మునిగిపోతున్నది గమనించి పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు నవీన్ కుమార్ కు చెప్పాడు.
నవీన్ స్థానికులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లి చూసి.. నీటిలో కొన ఊపిరితో కొట్టుకుంటున్న అజయ్ ను బయటకు తీసి.. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో అజయ్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisements
గ్రామస్థుల సాయంతో గుంతలో చిక్కుకొని మరణించిన మరో బాలుడు నర్సింలు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు నర్సింలు తండ్రి లాలయ్య పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బడికి ప్రహరి సౌకర్యాలు లేకపోవడం కారణంగానే పిల్లలు తరుచూ స్కూల్ బయటకు వెళ్తున్నారని.. దీంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.