2024 ఎన్నికలే అజెండాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో జరిగే ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ, రాష్ట్ర పార్టీ శాఖల పదాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. మొత్తం సుమారు 300 మంది హాజరు కావచ్చునని భావిస్తున్నారు.
పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియవలసి ఉంది. అయితే దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. అలాగే రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానాలకు సంబంధించి మూడు, నాలుగు తీర్మానాలను నేతలు ఆమోదించే అవకాశాలున్నాయి. జీ- 20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేబట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో జీ-20 ఈవెంట్ల నిర్వహణ గురించి ఈ సమావేశాల్లో చర్చించవచ్చు.
ఈ సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా వీటిని నిర్వహించవచ్చు.
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ను రూపొందించవచ్చునని తెలుస్తోంది. గత ఏడాది జులైలో హైదరాబాద్ లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాల అమలును ఈ భేటీలో సమీక్షించే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.