జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాలుష్యం కాటేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకి గద్వాల పురపాలక సంఘ పరిధిలోని కొన్ని కాలనీల్లో నీరు కలుషితంగా మారింది. కలుషిత నీరు తాగిన కాలనీవాసుల్లో ఇద్దరు మృతిచెందగా, మరో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గంట గేరి, వేదనగర్ తదితర కాలనీలకు సరఫరా అయిన కలుషిత నీళ్లు తాగినవారు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
కలుషిత నీరు ప్రభావంతో 25 మంది దాకా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మరి కొంతమంది వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బాట పట్టడంతో మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
వేదనగర్, గంటగేరి, మొమిన్ మహాళ్ల, ధరూర్ మెట్టు ప్రాంతాల్లో తాగునీరు కలుషితమైందని కాలనీవాసులు చెబుతున్నారు. వాంతులు విరేచనాలతో బాధితులు ఇబ్బంది పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ లైన్మెన్ల ను పిలిచి మరి చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి నిలకడగా లేకపోవడంతో కర్నూల్ హాస్పిటల్ కి రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.