మధ్యప్రదేశ్ లో బార్గీ కెనాల్ కోసం నిర్మిస్తున్న సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరు కార్మికుల మృత దేహాలను రెస్క్యూ బృందాలు ఆదివారం రాత్రి శిథిలాల కింద నుంచి వెలికి తీశాయి.
బార్గీ కెనాల్ ప్రాజెక్ట్ కోసం భూగర్భ సొరంగం నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా 9 మంది టన్నెల్ లోకి వెళ్లారు. ఆ సమయంలో సొరంగం మార్గం పై ఉన్న మట్టి ఒక్క సారిగా కూలిపోయింది. దీంతో శిథిలాల కింద 9 మంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన సహాయక బృందాలు ఏడుగురిని రక్షించగలిగాయి.
‘ ఏడుగురు కార్మికులను కాపాడిన తర్వాత సహాయక బృందాలు ఇద్దరు కార్మికుల మృత దేహాలను వెలికితీశాయి. మృతుల్లో సింగ్రౌలి జిల్లాకు చెందిన గోర్ లాల్ కోల్(30), నాగపూర్ కు చెందిన సూపర్ వైజర్ రవి మసల్కర్(26) ఉన్నారు” అని హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేశ్ రాజోరా తెలిపారు.
ఏడుగురు కార్మికులను కట్నిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు వెల్లడించారు. ఘటనపై ఇప్పటికే కట్ని జిల్లా కలెక్టర్ ను సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వివరాలు అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలంటూ కలెక్టర్ ఆదేశించారు.