కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలనగర్ లో డ్రైనేజీ పనులు చేస్తుండగా పక్కనున్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా పనులు చేయిస్తూ.. కార్మికుల ప్రాణాలతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో విషయము వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తోంది.
స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలనే క్రమంలో రాత్రి సమయాల్లో కూడా పనులు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరో వైపు కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత తొందరలోనే స్మార్ట్ సిటీ నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కార్మికుల భద్రతను పూర్తిగా గాలికొదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.