నమీబియా నుంచి ఇండియాకు తెచ్చిన 8 ఛీతాల రక్షణకు ఏనుగులను రంగంలోకి దించారు. ప్రధాని మోడీ 72 వ జన్మ దినం సందర్భంగా ఈ నెల 17 న వీటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో వదిలారు. ముఖ్యంగా చిరుతలు, హైనాల నుంచి వీటిని రక్షించడం ఎంతో అవసరం. అయితే ఇది వన్యమృగ సంరక్షకులకు సాధ్యంకాదు గనుక ఏనుగులను తెప్పించారు.నర్మదాపురం లోని సాత్పురా టైగర్ రిజర్వ్ కేంద్రం నుంచి ‘లక్ష్మి’, ‘సిద్ధనాథ్’ అనే రెండు ఏనుగులను చీతాల రక్షణకోసం వినియోగిస్తున్నారు. ఇవి చిరుత పులులను భయపెట్టి వాటిని తరిమివేయగలవట.
కునో జాతీయ పార్కు సెక్యూరిటీ టీములతో బాటు ఈ ఏనుగులు రాత్రింబవళ్ళూ చీతాల రక్షణలో ఉంటున్నాయి. నమీబియా చీతాలు వాటికి ఉద్దేశించిన స్పెషల్ ఎన్ క్లోజర్ లో సుమారు నెలరోజులపాటు గడపాల్సి ఉంటుంది. వీటి ఎన్ క్లోజర్లవద్ద ‘లక్ష్మి’, ‘సిద్ధనాథ్’ ఏనుగులు ‘సెక్యూరిటీ బాధ్యతలు’ నిర్వర్తిస్తున్నాయి. అలాగే ఈ పార్క్ లో చిరుతలు వంటి జంతువులు ప్రవేశించకుండా అటవీ సిబ్బందితో కలిసి ‘గస్తీ’ తిరుగుతున్నాయి.
కానీ ఈ ఏనుగులతోనూ చిక్కే అంటున్నారు ఈ నేషనల్ పార్క్ అధికారి ప్రకాష్ కుమార్ వర్మ. 30 ఏళ్ళ సిధ్ధనాథ్ అనే ఏనుగుకి ‘టెంపర్’ ఎక్కువని, 2010 లో ఇద్దరు మావటీలను చంపేసిందని ఆయన తెలిపారు.
అదే సమయంలో 2021 లో ఓ పులిని అదుపు చేయడంలో ఈ గజరాజు కీలక పాత్ర వహించిందని కూడా ఆయన చెప్పారు. అయితే పాతికేళ్ల వయసున్న ‘లక్ష్మి’ ప్రశాంతంగా ఉంటుందని, కానీ తన ‘వర్క్’ లో మంచి ‘నైపుణ్యం’ కనబరుస్తుందని వర్మ అన్నారు. అటవీ ప్రాంతాల్లో గస్తీ తిరగడంలో ఇది సిబ్బందికి ఎంతో సాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఇక నమీబియా ఛీతాలు ఇంకా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాల్సి ఉందన్నారు.