ఏదో సందర్భంలో హీరో, హీరోయిన్ లు పరిచయం అవుతారు. పరిచయం స్నేహంగా మారుతోంది. స్నేహం ప్రేమగా చిగురిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లదండ్రులు ఇద్దరిని విడదీయడానికి చేయని ప్రయత్నం ఉండదు. వారు కలుసుకోకుండా ఉండటానికి పన్నని కుట్రలు ఉండవు. చివరికి వారు ఇంట్లో ఎదురుతిరుగుతారు. తెగిస్తారు. వారిద్దరు కలిసి బతకాలనే కోరిక ముందు తల్లిదండ్రులు ప్రేమ చిన్న బోతుంది. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తెలుగు సినిమాల్లో తరుచూ చూసే స్టోరీ ఇది. ఇదే స్టోరీ రాజస్థాన్ లో నిజంగా జరిగింది. నిజ జీవితంలో జరిగే కథనే సినిమా రూపంలో చూపిస్తారు కదా.. ఇందులో విశేషం ఏముంది అంటారా? అయితే.. ఈ కథలో హీరో, హీరోయిన్ ఇద్దరూ అమ్మాయిలే.. అవును తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయి.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు.
రాజస్థాన్, చురు జిల్లాలో రతన్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని బంధువులు ఇంటికి ఏడాది క్రితం వెళ్లింది. అక్కడ బంధువులు అమ్మాయితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొద్ది రోజుల్లో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఒకరికొకరు మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కలిసి బతకాలి అనుకున్నారు. అయితే వాళ్ల ఇంట్లో ఈ విషయం తెలియడంతో వారి నిర్ణయానికి ఎదురు చెప్పారు. ఇద్దరు కలుసుకోకుండా ఉండే ప్రయత్నం చేశారు. మన తెలుగు సినిమాల్లో ప్రేమకు ఓటమి ఉండదు అంటారు కదా. కాబట్టి తల్లిదండ్రులు వేసిన సంకెళ్లు వీరిద్దరి ప్రేమని ఆపలేకపోయాయి.
రతన్‌గఢ్‌కు చెందిన యువతి 2021, నవంబర్ 12న ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపుర్ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. ఇద్దరు అక్కడ వివాహం చేసుకొని గత రెండు నెలలుగా కాపురం ఉంటున్నారు. అయితే, నవంబర్ 14న రతన్‌గఢ్ యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 2022, జనవరి 12న ఈ కొత్త దంపతులను గుర్తించారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయ్నతం చేశారు. తల్లిదండ్రులతో పాటు పోలీసులు, అధికారులు కూడా చెప్పారు. కానీ, ఆ యువతులు తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ వారి తల్లిదండ్రులు వెనుదిరిగారు.