వక్ఫ్ భూముల విషయంలో తలెత్తిన వివాదం.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఆ భూములు మావంటే మావి అంటూ ఒక వర్గంపై మరో వర్గం వారు గొడ్డళ్లు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని అమ్మపాలెంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని వక్ఫ్ భూముల విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. గొడ్డళ్లు, కత్తులు, రాళ్లతో కొట్టుకున్నారు. ఆ భూములు వంశ పారంపర్యంగా తమవేనని ఒక వర్గం వారు వాదించగా.. తాము కొన్నామని మరో వర్గం వారు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది.
అయితే, ఇటీవల ఒక వర్గానికి చెందిన వారు ఆ భూములను విక్రయించే ప్రయత్నం చేస్తుండగా మరో వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సినీ ఫక్కీలో ఇరు వర్గాలు కత్తులు, గొడ్డళ్లతో కొట్టుకున్నారు. ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.