గుర్తు తెలియని ఇద్దరు యువకులు టూవీలర్‌పై వచ్చారు. అక్కడక్కడే తిరుగుతూ అనుమానస్పదంగా వ్యవహరించారు. ఇది గమనించిన గ్రామస్తులు వారి దగ్గరకి వెళ్లి.. ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. దానికి ఆ యువకులు సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా.. తుపాకీ బయటపడింది. దీంతో ఇద్దరు యువకులను గ్రామస్తులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బుధవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. అమీన్‌పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో తుపాకీతో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఉదయం గుర్తు తెలియని ఇద్దరు యవకులు టూవీలర్‌పై గ్రామానికి వచ్చారు. అయితే, వారు అనుమానస్పదంగా కనిపించటంతో గ్రామస్తులు వారి వద్దకు వెళ్లి ఎక్కడి నుంచి వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారు..? ఎవరు మీరు..? అని అడిగారు. దీనికి వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు.
దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద తుపాకీ ఉండటం గమనించి, దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారి నుంచి తుపాకీ, ఐదు బుల్లెట్లు, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని.. ఎక్కడి నుంచి వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారు..? ఎవరు మీరు..? అనే కోణంలో విచారిస్తున్నారు.