కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారుల వార్ పై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వారిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ లో పెట్టింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి దేవాదాయ శాఖ కమిషనర్ గా పని చేస్తున్నారు. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను ప్రభుత్వం నియమించింది. అదే సమయంలో కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ రూప స్థానంలో డీ. భారతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఐపీఎస్ అధికారి రూప భర్త మునీష్ మౌద్గిల్ కూడా ఐఏఎస్ గా ఉన్నారు. ఆయనపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయన్ని ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. నిన్న వారి ఘర్షణపై హోం మంత్రి సీరియస్ అయ్యారు. ఆ కొద్ది గంటల్లోనే వారి బదిలీ ఉత్తర్వులు వెలుపడటం గమనార్హం.
ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎస్ రూప తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దీంతో గొడవ మొదలైంది. తన ఫోటోలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు ఐఏఎస్ రోహిణి పంపించారంటూ రూప ఆరోపించారు. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ ఆమె పోస్టులో పేర్కొంది.
దీనిపై ఐఏఎస్ సింధూరి ఫైర్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా, రూప తప్పుడు ప్రచారం చేస్తోందని సింధూరి ఆరోపించింది. తన వాట్సాప్‌లోని స్క్రీన్‌షాట్లను తీసి, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను తీసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫోటోలు పెడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. దీంతో వారిద్దరిపై ప్రభుత్వం సీరియస్ అయింది.