కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. రగులూతూనే ఉండటం కాదు కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత సభలు, సమావేశాలు, ర్యాలీలంటూ కాంగ్రెస్ లో హడావిడి పెరిగింది. నేతలంతా ఒక్కొక్కరిగా చేయి కలుపుతున్నట్లు కనపడింది.
కానీ నివురుగప్పిన నిప్పులా అసంతృప్తితో ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమను కావాలనే పక్కనపెడుతున్నారని, పార్టీలో ఒక్కరే ప్రచారం కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డిని మళ్లీ టార్గెట్ చేశారు. పార్టీలో కొత్త జోష్ వస్తున్న సమయంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ గా దృష్టిపెట్టింది.
జగ్గారెడ్డి కామెంట్స్ చేసే ముందు సీఎల్పీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. జగ్గారెడ్డి ముందు నుండి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఉంటూ వస్తున్నారు. పైగా ఈ ఇద్దరు ఎంపీలు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దళిత గిరిజన దండోరా సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ, రేవంత్ రెడ్డిపై అసంతృప్త మీటింగ్ మాత్రం వీరి కనుసన్నల్లోనే జరిగింది. ఇప్పటికే ఆ ఇద్దరు ఎంపీలపై గుర్రుగా ఉన్న ఏఐసీసీ, తాజా వ్యాఖ్యలతో మరింత ఆగ్రహంగా ఉంది. ఈ విషయాలను ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది పెడతారని… మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, గ్రూపులు కట్టి రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆరోపిస్తున్నాయి.