మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో రెండు ఛీతా కూనలు మృతి చెందాయి. జ్వాల అనే ఛీతాకు గత మార్చి 24 న నాలుగు పిల్లలు పుట్టాయి. అయితే వీటిలో ఒకటి ఇటీవలే మరణించగా ..మరో రెండు గురువారం మృతి చెందినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నాలుగో కూన ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని, దాన్ని అబ్జర్వేషన్ లో ఉంచామని వారు చెప్పారు. మొదటి నుంచీ ఈ నాలుగు కూనలూ బలహీనంగా, బరువు తక్కువగా ఉన్నాయని, ఇవి ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
రెండు మూడు రోజులుగా ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 47 డిగ్రీలు ఉందని, వేడి గాలులతో కూడిన వాతావరణం కారణంగా ఇవి మరణించి ఉంటాయని భావిస్తున్నామని ఈ పార్క్ వర్గాలు ఓ ప్రెస్ నోట్ లో తెలిపాయి. వీటిని సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా ఫలితం లేకపోయిందని వెల్లడించాయి.
డీహైడ్రేషన్ వల్ల ఇవి నీరసించిపోయినట్టు తెలుస్తోంది. ఇదివరకే మూడు ఛీతాలు మరణించగా.. ఇప్పుడు మూడు కూనలు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఈ పార్క్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. లోగడ మూడు నెలల్లో వరుసగా మూడు మరణించిన విషయం గమనార్హం.
గతంలో మూడు జంతువుల మృతిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇక్కడి వాతావరణం వాటికి సరిపడనందున మిగిలిఉన్నవాటినైనా రాజస్తాన్ కి తరలించాలని సూచించింది. ఆఫ్రికన్ ఛీతాలకు ఇండియాలోని వాతావరణం, పరిస్థితులు అనువుగా లేవని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.