గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుస వివాదాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు. ట్విట్టర్, ఫేసుబుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మంగల్ హాట్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
డిసెంబర్ 6, 1992లో కరసేవకులకు శ్రద్దాంజలి ఘటిస్తూ, వారి బలిదానాలను స్మరిస్తూ చేసిన పోస్టులో ఎక్కడా వివాదాస్పదం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక లవ్ జిహాద్ శ్రద్ధ వాకర్ హత్య కేసులో ఫేస్ బుక్‌లో వైరల్ అవుతున్న మీమ్ కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన వెల్లడించారు.
మరోవైపు దీనిపై రాజాసింగ్ తరఫు న్యాయవాది కరుణ సాగర్ కూడా స్పందించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. కేవలం అత్యుత్సాహంతోనే రాజాసింగ్ కు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ఆయన తెలిపారు.
షోకాజ్ నోటీసులకు రేపటిలోగా సవివరంగా లిఖిత పూర్వక సమాధానం ఇస్తామని చెప్పారు. తాము ఇచ్చి సమాధానంతో పోలీసులు సంతృప్తి చెందక పోతే తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ వచ్చింది.
బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానం పలు కండీషన్లు పెట్టింది. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఎలాంటి వివాదస్పద పోస్టులూ పెట్టకూడదని కోర్టు సూచించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టులపై పోలీసులు నిఘా పెట్టారు.