అవసరానికో దొంగతనం…దోచుకోడానికో వేషం అన్నట్టు సాగుతోంది నగరంలోని నేరగాళ్ళ పరిస్థితి. దొంగతానాన్ని వ్యసనంగా మలచుకున్నారు దుండగులు. కొందరు పట్టపగలే మహిళల మెళ్ళో బంగారం తెంచుతుంటే, కొందరు నిశిరాత్రుల్లో నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు.
ఇంకొందరు వేసిన తాళాలు వేసినట్టుండ గానే ఇల్లుగుల్ల చేస్తున్నారు. మరికొందరు మారు వేషంలో మస్కాకొడుతున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టు సాగుతోంది ఈ దొంగల దోపిడీ దందా. రీసెంటుగా లేడీగెటప్ లో వచ్చి దోపిడీలకు పాల్పడుతున్న జాదూగాళ్ళ బండారం సంగారెడ్డి జిల్లా ఐడియాబొల్లారంలో చోటోచేసుకున్న ఈ సంఘటనలో స్థానికులే సంఘటితంగా పట్టుకుని దొంగల ఆటకట్టించారు.
వివరాల ప్రకారం…బొల్లారం మున్సిపల్ పరిధిలో అర్థ రాత్రి పాన్ షాప్, కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి అందులోని మొత్తం డబ్బును కాజేశారు. అంతటితో ఆగని దుండగులు అత్యాశతో అక్కడున్న ఓ కంపెనీలోకి ప్రవేశించారు. అది గమనించిన కంపెనీలో సెక్యూరిటీ గార్డు స్థానికులకు సమాచారం ఇచ్చాడు.
అందరు కలిసి వారిని గమనించి అక్కడ వున్న సొత్తును దోచుకుంటుండగా మూకుమ్ముడిగా లోపలికి వెళ్లి ఆఇద్దరి దొంగలను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించినా కలిసికట్టుగా ప్రతిఘటించారు. దీంతో తప్పించుకునే దారిలేని దొంగలు బిక్కమొహం వేసి అక్కడే ఉండిపోయారు. ఇక స్థానికులు, సెక్యూరిటీ కలిసి ఆఇద్దరి దొంగలకు దేహశుద్ధి చేశారు.
పోలీసులీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే పనిలో పడ్డారు. అందులో ఒకడు గంజాయి మత్తులో ఉన్నాడని, మరొకరు ఆడవేషం ధరించాడని తెలిపారు. వీరి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి వుందని పేర్కొన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులకు అప్పగించడంతో..స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.