ఇటీవల కాలంలో హత్యలు బహిరంగంగానే చోటు చేసుకుంటున్నాయి. కత్తులు, తుపాకులతో నిందితులు రోడ్లపైనే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. తాజాగా కత్తులతో ఇద్దరు వ్యక్తులు న్యాయస్థానంలోకి ప్రవేశించాలని చూశారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వారి వద్ద ఉన్న ఆయుధాలను గుర్తించి వారిని కోర్టులోకి వెళ్లకుండా ఆపగలిగారు.
వివరాల్లోకెళితే..మియాపూర్‌కు చెందిన ఓ యువతి తన క్లాస్ మేట్ అయిన మైనారిటీ యువకుడు అక్బర్‌ను ప్రేమించింది. ఉప్పల్ చెంగిచర్ల ఆర్య సమాజ్‌లో వీరు వివాహం చేసుకున్నారు. అయితే, తర్వాత కుటుంబ కలహాలు రాగా, మూడు నెలల కిందట విడాకులకు కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ క్రమంలోనే అమ్మాయి తమ్ముడు సాయికిరణ్ అక్బర్‌పై కోపం పెంచుకున్నాడు. ఇటీవల అక్బర్ కోర్టుకు హాజరవుతున్నాడని తెలుసుకున్న సాయి కిరణ్..తన స్నేహితుడితో కలిసి నడుములో కత్తి పెట్టుకుని కోర్టులోకి ప్రవేశించాలని చూశాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అయితే, తమకు ప్రాణహాని ఉందనే తన తమ్ముడు ఇలా కత్తులు కోర్టులోకి తీసుకురావాలనుకున్నాడని సదరు అమ్మాయి తెలపడం గమనార్హం.
ఇటీవల కాలంలో పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో అటువంటి దారుణం జరగకుండా సెక్యూరిటీ సిబ్బంది ఆపారని పోలీసులు చెప్తున్నారు. సదరు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని న్యాయవాదులు సెక్యూరిటీ సిబ్బందిని అభినందించారు. సెక్యూరిటీ వారి అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.