హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. ఆదివారం ఉదయం మార్గమధ్యలో దురాజ్‌పల్లి వద్ద బస్సులో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది.
అందులో ఉన్న ప్రయాణికుల్ని కండక్టర్ మరో బస్సులో తరలించారు. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు విజయవాడ నుంచి మరో బస్సును రప్పించారు. బస్సులు రెండు ఒకదాని వెనుక ఒకటి ఉండగా.. నిలిచిపోయిన బస్సుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో ఓ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి.
నిమిషాల వ్యవధిలోనే రెండు బస్సులకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటల్ని చూసి రహదారిపై వెళ్లేవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది.
బస్సుల్లో మంటలు చేలరేగటంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.